
బాలీవుడ్ కథానాయిక కరీనాకపూర్ కి లౌక్యం తెలియదా? తెలియదనే అంటున్నారిప్పుడు. లేకపోతే అలా ఒకర్ని పొగిడితే మరొకరికి కోపం వస్తుందన్న విషయం తెలియకపోతే ఎలా? అని కూడా అంటున్నారు. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే, ఆమధ్య మలయాళంలో వచ్చిన 'బాడీగార్డ్' సినిమాని ప్రస్తుతం హిందీలో కూడా రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమా చేసే ముందు అందులో హీరోయిన్ గా నటిస్తున్న కరీనాని నయనతార నటించిన మలయాళం వెర్షన్ తో బాటు, అసిన్ నటించిన తమిళ వెర్షన్ కూడా చూడమని దర్శకుడు సిద్ధిక్ సూచించాడట. చూశాక తన అభిప్రాయం అడిగితే, అసిన్ కన్నా నయనతార బాగా నటించిందని కరీనా కామెంట్ చేసింది. ఇప్పుడిదే పెద్ద కాంట్రావార్సీ అయి కూర్చుంది. కరీనా కామెంట్స్ విన్న అసిన్ ఇప్పుడు కరీనాపై మండిపడుతోంది. "నా నటనకి ఒకరు సర్టిఫికేట్ ఇవ్వక్కర్లేదు. నేనేమిటో బాలీవుడ్ లో అందరికీ తెలుసు. ఎవరి పని వాళ్లు చేసుకుంటే బాగుంటుంది" అంటూ కరీనాకి చురకంటించింది. దీంతో, అనవసరంగా నయనతారని పొగిడి ఇబ్బందుల్లోపడ్డానే.. అని కరీనా ఇప్పుడు ఫీలవుతోందట! | |