e-cigarette review Ping Yahoo GOSSIPS

Monday, February 28, 2011

వైభవంగా వైజయంతీ మూవీస్ 'శక్తి' ఆడియో ఫంక్షన్

వైజయంతీ మూవీస్ యన్టీఆర్ కథానాయకుడిగా మెహర్ రమేష్ దర్శకత్వంలో నిర్మించిన 'శక్తి' సినిమా ఆడియో ఫంక్షన్ ఈ రోజు (ఫిబ్రవరి 27) హైదరాబాదులోని హైటెక్స్ ప్రాంగణంలో యన్టీఆర్ అభిమానుల సమక్షంలో వినూత్నంగా, వైభవంగా జరిగింది. అందమైన భారీ వేదికపై పలు డ్యాన్స్ కార్యక్రమాలతో అభిమానులను అలరించే విధంగా ఈ వేడుకను నిర్వహించారు. ఈ సినిమాలోని పాటలకు యన్టీఆర్, ఇలియానా స్టేజ్ పై డ్యాన్స్ లు చేయడం విశేషం. ఈ డ్యాన్సులకి అభిమానులు కేరింతలు కొడుతూ ఎంజాయ్ చేసారు. పాటల సీడీలను హీరో యన్టీఆర్ రిలీజ్ చేసి, జాకీ ష్రాఫ్, ఇలియానా, మెహర్ రమేష్ తదితరులకు అందజేశాడు.
       ఈ సందర్భంగా నిర్మాత అశ్వనీదత్ మాట్లాడుతూ, "మా బ్యానర్ లో నందమూరి వంశానికి చెందిన మూడు తరాల హీరోలతో సినిమాలు నిర్మించే అదృష్టం దక్కింది. రేపు బాలయ్య బాబు తనయుడితో చేయడానికి కూడా మేం రెడీగా వున్నాం. ఇక ఈ సినిమా గురించి చెప్పాలంటే, యన్టీఆర్ విశ్వరూపాన్ని ఇందులో చూడచ్చు. అంతటి స్థాయిలో ఆయన నటన వుంటుంది. మెహర్ రమేష్ 500 మంది టెక్నీషియన్లతో ఈ సినిమాను వివిధ లోకేషన్లలో షూట్ చేసారు. మా సంస్థ ప్రతిష్టను పెంచే స్థాయిలో సినిమా వుంటుంది" అన్నారు.
         దర్శకుడు మెహర్ రమేష్ చెబుతూ, "నా చిన్నప్పుడు వైజయంతీ మూవీస్ సినిమా వచ్చిందంటే, మా విజయవాడలో అప్సరా థియేటర్ కి వెళ్లి, లైన్ లోనిలబడి టికెట్ తీసుకుని సినిమా చూసేవాడిని. అలాంటి సంస్థలో ఈ భారీ సినిమా చేయడం చాలా హ్యాపీగా వుంది. బడ్జెట్టు, టైము అనే లిమిటేషన్లు పెట్టుకోకుండా సినిమాని తీయమని నిర్మాత దత్తు గారు మాకు చెప్పారు. ఒక విధంగా ఈ సినిమాకు ఆయనే ప్రాణం. ఆయనకు సినిమా నచ్చితే జనానికి నచ్చినట్టే! ఆయన జడ్జిమెంటు అంతలా వుంటుంది. యంగ్ టైగర్ యన్టీఆర్ తన నట విశ్వరూపాన్ని ప్రదర్శిస్తాడిందులో. ఐదు డైమంషన్స్ లో అతను కనపడతాడు. శక్తి పీఠాలకు సంబంధించిన కథ ఇది. యన్టీఆర్ మాత్రమే చేయగల క్యారెక్టర్ ఇది. సినిమాని మన దేశంలోనూ, విదేశాలలోనూ ఎన్నో లోకేషన్లలో షూట్ చేసాం.ఎంతో ప్రయాసతో కుంభమేళాలో కూడా షూటింగ్ చేసాం" అన్నారు. 
       హీరో యన్టీఆర్ మాట్లాడుతూ, "నేనెప్పుడూ ఇలా స్టేజ్ మీద డ్యాన్స్ చేయలేదు. ఇదే తొలిసారి. మీరు ఇంత ప్రేమతో ఈ ఫంక్షన్ కి అతిథులుగా వచ్చారు కాబట్టి చేయాలనిపించింది. ఈ రోజు ఈ వేడుకను చూసి తాతగారు ఎంతగానో ఆనందపడతారనుకుంటున్నాను. మెహర్ రమేష్ నా ఆప్తమిత్రుడు. ఓసారి మలేసియాలో 'ఓ కథ చెబుతాను విను' అంటూ ఈ 'శక్తి' కథ చెప్పాడు. అతనీ కథను ఎవరితో చేద్దామనుకున్నాడో కానీ, నేను మాత్రం 'నాతో కాకుండా ఇంకెవరితో చేస్తావ్?' అన్నాను. మాకు దత్తు గారు తోడయ్యారు. ఈ ప్రాజక్టు అలా మొదలైంది. 'ఆది' సినిమా నుంచీ కూడా మణి అన్న నాకు మంచి సాంగ్స్ ఇస్తున్నాడు. ఇందులో కూడా అదరగొట్టాడు. అలాగే కెమెరా మేన్ సమీర్ రెడ్డి ఫోటోగ్రఫీ అద్భుతంగా వుంది. ఎడిటింగ్ లో ఓ పాటలో నన్ను నేను చూసుకుని నమ్మలేకపోయాను. అలాగే, ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కొత్త లోకాలు క్రియేట్ చేసాడు. అందరూ ఎవరికి వాళ్లు అద్భుతంగా వర్క్ చేసారు" అన్నారు.
       చివర్లో, ఈ సినిమాలోని యన్టీఆర్ పాత్ర 'రుద్ర'కు సంబంధించిన వీరరసంతో కూడిన ఫోటో పోస్టర్ ను జాకీ ష్రాఫ్ వేదికపై ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఇంకా మంజు భార్గవి, కె.యస్.రామారావు, బోయపాటి శ్రీను, హీరోయిన్లు ఇలియానా, మంజరి, మణిశర్మ, సమీర్ రెడ్డి, నిర్మాత కుమార్తెలు స్వప్నా దత్, ప్రియాంకా దత్ తదితరులు పాల్గొన్నారు. సుమ వ్యాఖ్యాతగా వ్యవహరించింది. ఈ వేడుక ప్రారంభానికి ముందు యన్టీఆర్ అభిమానులు వేలాది మంది నగరంలో బైక్ ర్యాలీని నిర్వహించారు.

నేటి వార్తలు....టూకీగా

*  ప్రస్తుతం సంపత్ నందితో ఓ సినిమా ఒప్పుకున్న రామ్ చరణ్ త్వరలో వి.వి.వినాయక్ దర్శకత్వంలో కూడా మరో చిత్రాన్ని చేయనున్నాడు. ఇందుకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ప్రస్తుతం జరుగుతోంది.
*  'అమ్మ' రాజ శేకర్ దర్శకత్వంలో శ్రీహరి కథానాయకుడుగా నటిస్తున్న 'ముద్ర' సినిమా చివరి షెడ్యులు షూటింగ్ రేపటి (మార్చి 1) నుంచి హైదరాబాదులో జరుగుతుంది.
*  కమేడియన్ అలీ హీరోగా వేమగిరి దర్శకత్వంలో రూపొందిన 'తిమ్మరాజు' సినిమా మార్చి 11 న రిలీజ్ అవుతుంది.
*  'వేదం' తమిళ రీమేక్ నుంచి స్నేహా ఉల్లాల్ ని తొలగించి ఆమె స్థానంలో జాస్మిన్ ని తీసుకున్నారు. క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో ఇప్పటికే శింబు, స్నేహాలపై కొంత షూటింగ్ చేసారు.
*  తెలుగు బ్లాక్ బస్టర్ మూవీ 'మగధీర' ను హిందీలో రణభీర్ కపూర్ తో రీమేక్ చేయడానికి నిర్మాత అల్లు అరవింద్ ప్లాన్ చేస్తున్నాడు.
*  తనపై  కుళ్ళు జోకుల సర్క్యులేషన్, వెబ్ సైట్ (I HATE BALAYYA .COM) నిర్వహణపై బాలకృష్ణ సైబర్ క్రైమ్స్ డీసీపీకి కంప్లయింట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ వెబ్ సైట్ ను ఆస్ట్రేలియా నుంచి ఓ తెలుగు వ్యక్తీ నిర్వహిస్తున్నట్టు పోలీసులు కనుగొన్నారు.

మణిరత్నం తో మహేష్ బాబు సినిమా ఖరారు

మహేష్ బాబు ఇప్పుడు చాలా చాలా హ్యాపీగా వున్నాడు. దానికి కారణం నిన్న (ఫిబ్రవరి 27) చెన్నైలో ప్రముఖ దర్శకుడు మణిరత్నం ను కలిసి, ఆయనతో చాలా సేపు మాట్లాడాడు. మణి దర్శకత్వంలో మహేష్ ఓ సినిమా చేయనున్నాడన్న వార్తలు గత కొంత కాలంగా వస్తున్న సంగతి తెలిసిందే. అదిప్పుడు వాస్తవ రూపం దాలుస్తోంది. మహేష్ కూడా దీనిని కన్ఫర్మ్ చేసాడు.
              "ఈ రోజు నా జీవితంలో ఎంతో ఆనందకరమైన దినం. లెజెండరీ మణి సార్ ని కలిసాను. ఆయనతో సినిమా చేయాలన్న నా కల నిజమవుతోంది. మణి సార్ తో సినిమా చేస్తున్నాను" అన్నాడు మహేష్. చారిత్రాత్మక కథాంశంతో మణిరత్నం రూపొందించే భారీ చిత్రంలో మహేష్ నటిస్తున్నాడు. మొదటి నుంచీ ఇందులో ప్రధాన హీరోగా మహేష్ నే తీసుకోవాలని మణి ఆలోచిస్తూ వచ్చాడు. పూర్తి వివరాలు త్వరలో తెలుస్తాయి.

అనుష్కకి 'బాడీ' సమస్య

కథానాయిక అనుష్కకు ఇప్పుడు పెద్ద చిక్కొచ్చిపడింది. అదేమిటంటే, ఓసారి సన్న పడాలి... మరోసారి కాస్త ఒళ్లు తెచ్చుకుని బొద్దుగా తయారవ్వాలి. ఎందుకంటారా... తానిప్పుడు తెలుగు, తమిళ భాషల్లో ఏక కాలంలో నటిస్తోంది కదా... తమిళ ప్రేక్షకులేమో హీరోయిన్లు కాస్త బొద్దుగా ఉంటేనే ఇష్టపడతారు. సన్నగా నాజూగ్గా వుంటే వాళ్లకి నచ్చదు. మన తెలుగు వాళ్లకైతే, బొద్దుగా వుంటే నచ్చదు. మెరుపు తీగలా, సన్నజాజి తీగలా వుండాలి! ఇప్పుడీ ఇబ్బందిని అనుష్క ఎదుర్కుంటోంది.
           "కోలీవుడ్ కి, టాలీవుడ్ కీ ఒకేసారి డేట్లు ఇస్తే ఇక మా పని అయిపోయినట్టే. బాడీ ప్రాబ్లం వచ్చేస్తుంది. అందుకని రెండు షూటింగులకీ కాస్త గ్యాప్ ఉండేలా చూసుకోవాలి. తమిళ్ సినిమా షూటింగుకి రెడీ అయ్యే ముందు బాగా తిని ఒళ్లు పెంచాలి. మళ్లీ తెలుగు షూటింగుకి వచ్చే ముందు డైటింగులు, వర్కౌట్లు చేసి సన్నబడాలి. ఇది చాలా కష్టంతో కూడిన వ్యవహారం. ఇలా వుంటాయి మా బాధలు " అంటోంది. అందుకే, చాలా జాగ్రత్తలు తీసుకుంటోందట ఈ మంగుళూరు బ్యూటీ!

ఏ.ఆర్.రెహ్మాన్ కి ఆస్కార్ నిరాశ

సంగీత మాంత్రికుడు ఎ.ఆర్.రెహ్మాన్ కు ఈసారి ఆస్కార్ అవార్డుల్లో నిరాశ ఎదురైంది. ఆయన ఎన్నో ఆశలు పెట్టుకున్న '127 అవర్స్' సినిమాకు అవార్డు రాలేదు. బెస్ట్ ఒరిజినల్ స్కోర్ విభాగంలో రెహ్మాన్ కు ఈ సినిమా పరంగా ఆస్కార్ నామినేషన్ లభించిన సంగతి తెలిసిందే. అయితే, 'ది సోషల్ నెట్ వర్క్' సినిమా ఈ అవార్డును సొంతం చేసుకుంది. దీనికి సంగీతాన్ని సమకూర్చిన ట్రెంట్ రేజ్నార్, ఆటికస్ రాస్ సంయుక్తంగా బెస్ట్ ఒరిజినల్ స్కోర్ అవార్డును అందుకున్నారు. రెండేళ్ల క్రితం 'స్లం డాగ్ మిలియనీర్' సినిమాకి రెహ్మాన్ రెండు ఆస్కార్లు అందుకున్న సంగతి తెలిసిందే!

త్రిష ప్రయత్నాలు ఫలించేనా?

త్రిష ఈమధ్య రెచ్చిపోయి మరీ పత్రికలకి పోజులిస్తోంది. సౌత్ నుంచి వచ్చే మేగజైన్లకే కాకుండా, ముంబై నుంచి వచ్చే మేగజైన్లకి కూడా హాట్ హాట్ పోజులిస్తూ అందరి మతులూ పోగొడుతోంది. ఈ ఫొటో సేషన్లకి ప్రత్యేకంగా టైం కూడా కేటాయిస్తోంది. త్రిష ఇప్పుడు ఎందుకిలా రెచ్చిపోతూ పోజులిస్తోందన్న విషయాన్ని ఎంక్వైర్ చేస్తే అసలు విషయం బయటపడింది. తన సెక్సీ లుక్కులతో బాలీవుడ్ దృష్టిలో పడడానికట!
               తను నటించిన తొలి హిందీ సినిమా 'కట్టా మీటా' పెద్ద ఫ్లాప్ అవడంతో ఈ చెన్నై భామ ఆమధ్య బాగా అప్ సెట్ అయింది. మళ్లీ అంతలోనే తేరుకుని, ఏది ఏమైనా బాలీవుడ్ లో సక్సెస్ అవ్వాలని డిసైడ్ అయిందట. అందుకని అక్కడ సినిమా అవకాశాలు పొందడానికి ఇప్పుడిలా హాట్ హాట్ గా కనిపిస్తోంది. "సౌత్ కీ, హిందీకీ కాస్త తేడా వుంది. అక్కడ సక్సెస్ కావాలంటే బాగా హాట్ గా కనపడాలి. లేకపోతే కష్టం. అందుకే ఈ ప్రయత్నాలు" అంటోంది నవ్వుతూ. మరి, వ్రతం చెడినా త్రిషమ్మకు ఫలితం దక్కుతుందో, లేదో చూద్దాం!

'బ్రేకింగ్ న్యూస్ బాబూరావ్' గా శివాజీ

హైదరాబాదులోని ఓ ఎఫ్.ఎం. రేడియో 'బ్రేకింగ్ న్యూస్ బాబూరావ్' పేరిట ఓ సెటైరికల్, ఫన్నీ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంటుంది. ఇప్పుడీ పేరుని ఓ సినిమాకి టైటిల్ గా పెట్టుకున్నారు. శివాజీ హీరోగా తేజస్వి క్రియేషన్స్ నిర్మించే ఈ సినిమాకి నూతన దర్శకుడు కర్రి బాలాజీ దర్శకత్వం వహిస్తాడు. ఈ విషయాన్ని ఈ రోజు ఉదయం హైదరాబాదులో జరిగిన ప్రెస్ మీట్ లో నిర్మాతలు తెలియజేసారు. దర్శకుడు చెప్పిన కథ చాలా సరదాగా ఉండడంతో చేయడానికి ఒప్పుకున్నాననీ, సినిమా అంతా ఫన్నీగా సాగుతుందనీ హీరో శివాజీ చెప్పాడు. ఈ చిత్రాన్ని తిరుపతి రావు, పెద్దిరెడ్ల త్రినాధ్, చల్లా రెడ్డి నిర్మిస్తున్నారు. సోమా విజయ ప్రకాష్ సమర్పకుడిగా వ్యవహరిస్తారు. శ్రీలేఖ సంగీతం అందిస్తోంది.
Related Posts Plugin for WordPress, Blogger...