e-cigarette review Ping Yahoo GOSSIPS: తెరమరుగవుతున్న తెలుగు విలనిజం!

Monday, January 23, 2012

తెరమరుగవుతున్న తెలుగు విలనిజం!

తెలుగు సినిమా వెలుగు చూసిన నాటి నుంచి ఎన్నో వైవిధ్యమైన కథలు ప్రేక్షకుల హృదయాలను కొల్లగొడుతూ వస్తున్నాయి. పౌరాణిక-జానపద-సాంఘిక-చారిత్రకాలలో కథాంశం ఏదైనా నాయకుడితోపాటు ప్రతి నాయకుడు ఉండటం సహజం. సినిమాల్లో కనిపించే నాయక ప్రతినాయకులు జీవితంలోని చీకటి వెలుగులను ప్రతిబింబిస్తుంటారు. చీకటి ఉన్నప్పుడే వెలుగు విలువ...చెడు ఉన్నప్పుడే మంచి విలువ తెలుస్తుంది. అలాగే పవర్ ఫుల్ విలన్ ఉన్నప్పుడే హీరో ఎంత సత్తా ఉన్నవాడనేది తెలుస్తుంది. అందుకే, తెలుగు సినిమా తొలి నాళ్ల నుంచి కూడా విలన్ పాత్రలకి ఎంతో ప్రత్యేకత- ప్రాధాన్యత ఏర్పడ్డాయి. దాంతో కథానాయకుడితో సమానమైన ఇమేజ్ విలన్ కి కూడా లభిస్తూ వచ్చింది.
      కథానాయకుడు తన ఆట పాటలతో...హీరోయిజంతో  ఆడియన్స్ ని ఆకట్టుకుంటే, విలన్ మాత్రం తన విలక్షణమైన నటనతోనే ఎక్కువ మార్క్ లు సంపాదించుకోవలసి వస్తుంది. విలన్ల మేనరిజమే వాళ్లకి ప్రేక్షకుల హృదయాల్లో ప్రముఖ స్థానాన్ని కల్పిస్తుంది. ఎస్.వి.రంగారావు...రాజనాల...నా
గభూషణం...ప్రభాకర్ రెడ్డి...త్యాగరాజు...సత్యనారాయణ...రావు గోపాలరావు...నూతన్ ప్రసాద్...కోట శ్రీనివాసరావు... తదితరులు ఇదే విషయాన్ని నిరూపించారు. పాత బంగారం లాంటి ఆనాటి కథలను పరిశీలిస్తే... నాయకుడు-ప్రతినాయకుడు కథని సమతూకంగా నడిపించిన తీరు కనిపిస్తుంది.
     ఆనాటి విలన్లలో ఒక్కొక్కరిదీ ఒక్కో శైలి. ఎస్.వి. రంగారావు విషయానికొస్తే విలనిజం లో ఆయన నభూతో...నభవిష్యతి అనిపించారు. కథానాయకుడు ఎంతటివాడైనా  ఒక చిన్నపాటి మాట విరుపుతో అదిలిస్తూ అధిగమించేవాడు. పౌరాణికాల్లోనే కాదు... జగమెరిగిన జానపద మంత్రగాడిగా జానపదాల్లోనూ ఎస్.వి. రంగారావు ఎదురులేని విలనే! ఆ సమయంలోనే కరుకైన కండలతో, చురుకైన చూపులతో యంగ్ విలన్ గా తన దైన ముద్ర వేశాడు రాజనాల. రాజ్యకాంక్షతో రగిలిపోయే ప్రతినాయకుడిగా ఆయన పండించిన విలనిజాన్ని అంత తేలిగ్గా ఎవరూ మరిచిపోలేరు.
     ఇక సాంఘికాల విషయానికొస్తే... గ్రామపెద్దగా కుటిల రాజకీయాలను చేసే విలన్ గా నాగభూషణం చూపిన వైవిధ్యానికి ఎవరైనా హ్యాట్సాఫ్ చెప్పల్సిందే. ఊతపదాల్ని ఉపయోగిస్తూ విలనిజాన్ని రక్తికట్టించిన తొలి విలన్ నాగభూషణమేనని చెప్పొచ్చు. ఆయన సంభాషణల్లోని గమ్మత్తైన విరుపు ... కామెడీ కోటింగ్ తో అందించిన విలనిజం ఆనాటి ప్రేక్షకులని విపరీతంగా అలరించింది. ఇక ప్రతినాయకుడిగా రావుగోపాలరావు సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఎన్టీఆర్, కృష్ణ, చిరంజీవి కాంబినేషన్ లో ఆయన చేసిన పాత్రలు అనితర సాధ్యాలని చెప్పొచ్చు. అలా తరాలవారీగా తరగని విలనిజాన్ని పండించిన ఘనత రావుగోపాలరావుకే దక్కింది.
     విలక్షణమైన విలనిజంతో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు నూతన్ ప్రసాద్. అనుకోని ప్రమాదం ఆయన్ని ఆ స్థానానికి దూరం చేయగా, కోట శ్రీనివాసరావు వెలుగులోకి వచ్చారు. విభిన్నమైన ఆయన మేనరిజానికి ప్రేక్షకులు బ్రహ్మరధంపట్టారు. కోట శ్రీనివాసరావు తర్వాత అడపాదడపా ఫ్యాక్షన్ సినిమాల్లోవిలన్ గా కనిపించిన జయప్రకాష్ రెడ్డిని మినహాయిస్తే, ఇక విలన్ లుగా వీలైనన్ని కొత్తముఖాలే కనిపిస్తాయి. జూ.ఎన్టీఆర్ , మహేష్ బాబు, రాం చరణ్, అల్లు అర్జున్, నితిన్, రామ్ తదితర యంగ్ హీరోల కాంబినేషన్ లో వచ్చిన ఏ సినిమాలోనూ మన తెలుగు విలన్ల జాడ కనిపించడం లేదు. ఇక్కడ నుంచే మనకి పరభాషా విలన్ల ప్రభావం పెరగడం, తెలుగు విలన్ లు తెరమరుగు కావడం కనిపిస్తుంది.
     ప్రకాష్ రాజ్, ముఖేష్ రుషి, ప్రదీప్ రావత్, ఆశిష్ విద్యార్ధి, షాయాజీ షిండే, సోనూసూద్, దేవ్ గిల్ తదితరులు విలన్లుగా ఈ తరం సినిమాలను ప్రభావితం చేస్తున్నారు. ట్రెండ్ తో పాటు విలనిజం మారుతుందని సరిపెట్టుకోలేం. పరభాష విలన్లని దిగుమతి చేసుకోవడం వైవిధ్యంగా భావించలేం. నేటి సినిమాల్లో కథ కన్నా ఖర్చుకి ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తుండటం వల్ల, కొత్తదనం పేరుతో చేస్తోన్న ప్రయోగాల వల్ల  విలనిజం రూపురేఖలు మారిపోతున్నాయి. ఆనాటి విలనిజంలో వ్యూహాలు కనిపిస్తే, ఈనాటి విలనిజం ఉన్మాదం అనిపిస్తుంది. ఈనాటి విలన్ ల వింత గెటప్ లు- వికృత చేష్టలు చూస్తుంటే వారి మానసిక స్థితిపై సగటు ప్రేక్షకుడికి కూడా సందేహం కలగక మానదు.
     ఆ రోజుల్లో హీరోలు -విలన్లు నువ్వా? నేనా? అన్నట్టు సమఉజ్జీలుగా ఉండే వాళ్లు. ఇక, ఈతరం హీరోలకి గానీ... వాళ్లతో తలపడే విలన్లకి గాని ఎక్కడా పొంతన ఉండదు. లేడిపిల్ల లాంటి హీరో... సింహం లాంటి విలన్ ని చితక బాదేయడం కాస్త విడ్డూరంగానే అనిపిస్తుంది. పోతే, ప్రాంతమేదైనా...భాష ఏదైనా...టాలెంట్ ఉన్న వాళ్లే ఇక్కడ రాణిస్తారనేది నూటికి నూరు శాతం నిజం. అయితే విలన్ పాత్రల్లో విజ్రుంభించగల ప్రతిభావంతులెందరో తెలుగులో ఉన్నారు. వాళ్లకి అవకాశమిచ్చి ప్రోత్సహిస్తే కథలో కొత్తదనమే కాదు, తెలుగుదనమూ ఉంటుంది. ఆ దిశగా ప్రయత్నాలు జరగాలనీ...గత వైభవం తిరిగిరావాలని ఆశిద్దాం.                                

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...