e-cigarette review Ping Yahoo GOSSIPS: వైభవంగా వైజయంతీ మూవీస్ 'శక్తి' ఆడియో ఫంక్షన్

Monday, February 28, 2011

వైభవంగా వైజయంతీ మూవీస్ 'శక్తి' ఆడియో ఫంక్షన్

వైజయంతీ మూవీస్ యన్టీఆర్ కథానాయకుడిగా మెహర్ రమేష్ దర్శకత్వంలో నిర్మించిన 'శక్తి' సినిమా ఆడియో ఫంక్షన్ ఈ రోజు (ఫిబ్రవరి 27) హైదరాబాదులోని హైటెక్స్ ప్రాంగణంలో యన్టీఆర్ అభిమానుల సమక్షంలో వినూత్నంగా, వైభవంగా జరిగింది. అందమైన భారీ వేదికపై పలు డ్యాన్స్ కార్యక్రమాలతో అభిమానులను అలరించే విధంగా ఈ వేడుకను నిర్వహించారు. ఈ సినిమాలోని పాటలకు యన్టీఆర్, ఇలియానా స్టేజ్ పై డ్యాన్స్ లు చేయడం విశేషం. ఈ డ్యాన్సులకి అభిమానులు కేరింతలు కొడుతూ ఎంజాయ్ చేసారు. పాటల సీడీలను హీరో యన్టీఆర్ రిలీజ్ చేసి, జాకీ ష్రాఫ్, ఇలియానా, మెహర్ రమేష్ తదితరులకు అందజేశాడు.
       ఈ సందర్భంగా నిర్మాత అశ్వనీదత్ మాట్లాడుతూ, "మా బ్యానర్ లో నందమూరి వంశానికి చెందిన మూడు తరాల హీరోలతో సినిమాలు నిర్మించే అదృష్టం దక్కింది. రేపు బాలయ్య బాబు తనయుడితో చేయడానికి కూడా మేం రెడీగా వున్నాం. ఇక ఈ సినిమా గురించి చెప్పాలంటే, యన్టీఆర్ విశ్వరూపాన్ని ఇందులో చూడచ్చు. అంతటి స్థాయిలో ఆయన నటన వుంటుంది. మెహర్ రమేష్ 500 మంది టెక్నీషియన్లతో ఈ సినిమాను వివిధ లోకేషన్లలో షూట్ చేసారు. మా సంస్థ ప్రతిష్టను పెంచే స్థాయిలో సినిమా వుంటుంది" అన్నారు.
         దర్శకుడు మెహర్ రమేష్ చెబుతూ, "నా చిన్నప్పుడు వైజయంతీ మూవీస్ సినిమా వచ్చిందంటే, మా విజయవాడలో అప్సరా థియేటర్ కి వెళ్లి, లైన్ లోనిలబడి టికెట్ తీసుకుని సినిమా చూసేవాడిని. అలాంటి సంస్థలో ఈ భారీ సినిమా చేయడం చాలా హ్యాపీగా వుంది. బడ్జెట్టు, టైము అనే లిమిటేషన్లు పెట్టుకోకుండా సినిమాని తీయమని నిర్మాత దత్తు గారు మాకు చెప్పారు. ఒక విధంగా ఈ సినిమాకు ఆయనే ప్రాణం. ఆయనకు సినిమా నచ్చితే జనానికి నచ్చినట్టే! ఆయన జడ్జిమెంటు అంతలా వుంటుంది. యంగ్ టైగర్ యన్టీఆర్ తన నట విశ్వరూపాన్ని ప్రదర్శిస్తాడిందులో. ఐదు డైమంషన్స్ లో అతను కనపడతాడు. శక్తి పీఠాలకు సంబంధించిన కథ ఇది. యన్టీఆర్ మాత్రమే చేయగల క్యారెక్టర్ ఇది. సినిమాని మన దేశంలోనూ, విదేశాలలోనూ ఎన్నో లోకేషన్లలో షూట్ చేసాం.ఎంతో ప్రయాసతో కుంభమేళాలో కూడా షూటింగ్ చేసాం" అన్నారు. 
       హీరో యన్టీఆర్ మాట్లాడుతూ, "నేనెప్పుడూ ఇలా స్టేజ్ మీద డ్యాన్స్ చేయలేదు. ఇదే తొలిసారి. మీరు ఇంత ప్రేమతో ఈ ఫంక్షన్ కి అతిథులుగా వచ్చారు కాబట్టి చేయాలనిపించింది. ఈ రోజు ఈ వేడుకను చూసి తాతగారు ఎంతగానో ఆనందపడతారనుకుంటున్నాను. మెహర్ రమేష్ నా ఆప్తమిత్రుడు. ఓసారి మలేసియాలో 'ఓ కథ చెబుతాను విను' అంటూ ఈ 'శక్తి' కథ చెప్పాడు. అతనీ కథను ఎవరితో చేద్దామనుకున్నాడో కానీ, నేను మాత్రం 'నాతో కాకుండా ఇంకెవరితో చేస్తావ్?' అన్నాను. మాకు దత్తు గారు తోడయ్యారు. ఈ ప్రాజక్టు అలా మొదలైంది. 'ఆది' సినిమా నుంచీ కూడా మణి అన్న నాకు మంచి సాంగ్స్ ఇస్తున్నాడు. ఇందులో కూడా అదరగొట్టాడు. అలాగే కెమెరా మేన్ సమీర్ రెడ్డి ఫోటోగ్రఫీ అద్భుతంగా వుంది. ఎడిటింగ్ లో ఓ పాటలో నన్ను నేను చూసుకుని నమ్మలేకపోయాను. అలాగే, ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కొత్త లోకాలు క్రియేట్ చేసాడు. అందరూ ఎవరికి వాళ్లు అద్భుతంగా వర్క్ చేసారు" అన్నారు.
       చివర్లో, ఈ సినిమాలోని యన్టీఆర్ పాత్ర 'రుద్ర'కు సంబంధించిన వీరరసంతో కూడిన ఫోటో పోస్టర్ ను జాకీ ష్రాఫ్ వేదికపై ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఇంకా మంజు భార్గవి, కె.యస్.రామారావు, బోయపాటి శ్రీను, హీరోయిన్లు ఇలియానా, మంజరి, మణిశర్మ, సమీర్ రెడ్డి, నిర్మాత కుమార్తెలు స్వప్నా దత్, ప్రియాంకా దత్ తదితరులు పాల్గొన్నారు. సుమ వ్యాఖ్యాతగా వ్యవహరించింది. ఈ వేడుక ప్రారంభానికి ముందు యన్టీఆర్ అభిమానులు వేలాది మంది నగరంలో బైక్ ర్యాలీని నిర్వహించారు.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...