e-cigarette review Ping Yahoo GOSSIPS: "పరమ వీర చక్ర కొత్త రికార్డులు నెలకొల్పుతుంది" -బాలకృష్ణ

Thursday, December 30, 2010

"పరమ వీర చక్ర కొత్త రికార్డులు నెలకొల్పుతుంది" -బాలకృష్ణ


 
 
 
 
         బాలకృష్ణ హీరోగా దాసరి దర్శకత్వంలో సి.కల్యాణ్ నిర్మిస్తున్న 'పరమ వీర చక్ర' చిత్రం ఆడియో  సీడీని ప్రముఖ దర్శకుడు కే.రాఘవేంద్ర రావు విడుదల చేయగా, యంగ్ హీరో యన్టీఆర్ తొలి సీడీని స్వీకరించారు. ఈ సందర్భంగా చెన్నై నుంచి ప్రత్యేకంగా విచ్చేసిన ముఖ్య అతిథి కే.బాలచందర్ తన శుభాభినందనలను తెలియజేసారు. యన్టీఆర్ మాట్లాడుతూ, ఈ సినిమాలోని కొన్ని బిట్స్ చూశాననీ, బాబాయ్ పోషించిన గెటప్స్ చూడడానికి రెండు కళ్ళూ చాలవనీ అన్నారు. ఫుల్ సినిమా ఎప్పుడు చూస్తానా అన్న క్యురియాజిటీతో వున్నానని అన్నారు. దర్శకుడు దాసరి చెబుతూ, "యన్టీ రామారావు గార్ని ఊహించుకొని ఈ సినిమా చేసాను. బాలయ్యలో ఆయననే చూస్తాం. అంత అద్భుతంగా చేసాడు బాలయ్య. రామారావు గారు ఎప్పుడూ అనేవారు, 'నా రాజకీయ ప్రవేశానికి 'సర్దార్ పాపారాయుడు', 'బొబ్బిలి పులి' సినిమాలు ఎంతగానో స్పూర్తినిచ్చాయ'ని. మరి రేపు, ఈ సినిమా ఎన్ని మలుపులకు కారణం అవుతుందో! రామారావు గారిలో చూసిన క్రమశిక్షణను మళ్లీ బాలయ్యలోనే చూసాను. వినయ విధేయతలు గల విధ్యార్ధిలా కనిపించాడు బాలయ్య. ఈ సినిమా గురించి ఇప్పుడు ఎక్కువ మాట్లాడను. రేపు సినిమానే మాట్లాడుతుంది" అన్నారు.
       బాలకృష్ణ మాట్లాడుతూ, "దర్శకరత్న దాసరి గారి 'శివరంజని' లో నేను నటించాలి. కానీ అప్పుడు చదువుకుంటున్నాను కాబట్టి నాన్నగారు అంగీకరించలేదు. వారితో పనిచేసే అదృష్టం ఇప్పటికి లభించింది. బొబ్బిలిపులి లో నాన్న గారికి పరమ వీర చక్ర అవార్డు ఇస్తారు. ఇప్పుడు అదే మాకు టైటిల్ అయింది. కృషితో నాస్తి దుర్భిక్షం అన్న నానుడిని నేను నమ్ముతాను. అలాగే దీనికి అందరం కష్టపడ్డాం. ఇది విజయవంతం కావడం ఖాయం.  ఇందులో పౌరాణిక గెటప్ లు వున్నాయి. ఇది మళ్లీ పౌరాణిక చిత్రాలకు నాంది పలకాలి. మణిశర్మ ఇచ్చిన మణిపూసల వంటి బాణీలు ఇందులో వున్నాయి. మంచి సినిమా చేసాం. ఇండియా గర్వించదగ్గ దర్శకులు దాసరి గారు. ఆయన నిత్య శ్రామికుడు. అందరూ బాగుండాలని కోరుకునే వ్యక్తి ఆయన. రేపు ఇది పాత రికార్డులను తుడిచిపెట్టి, కొత్త రికార్డులను నెలకొల్పుతుంది" అన్నారు.  ఈ కార్యక్రమంలో ఇంకా కే.విశ్వనాథ్, రాజమౌళి, బోయపాటి శ్రీను, కోట, బ్రహ్మానందం, అలీ, శ్రీను వైట్ల, వి.వి.వినాయక్  తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రం నలుమూలల నుంచీ వచ్చిన బాలకృష్ణ అభిమానులు చాలా సందడి చేసారు. ఝాన్సి ఈ వేడుకకు వ్యాఖ్యాతగా వ్యవహరించింది.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...