e-cigarette review Ping Yahoo GOSSIPS: "ఈ సినిమా కూడా వాటి సరసన చేరుతుంది" -బాలకృష్ణ

Wednesday, January 12, 2011

"ఈ సినిమా కూడా వాటి సరసన చేరుతుంది" -బాలకృష్ణ

బాలకృష్ణ అభిమానులకు ఈరోజు పండగ రోజు. ఎందుకంటే, వాళ్లు ఎంతో ఆత్రుతతో ఎదురుచూస్తున్న 'పరమ వీర చక్ర' చిత్రం విడుదల నేడే! 'సింహా' వంటి సూపర్ హిట్ తర్వాత బాలకృష్ణ చేస్తున్న ఈ చిత్రం ఆయన కెరీర్ లో నిలిచిపోయేలా రూపొందిందని చెబుతున్నారు. ఈ నేపధ్యంలో ఆ చిత్రం గురించి బాలకృష్ణ చెప్పిన విశేషాలు ఆయన ఇంటర్వ్యులో చదవండి.
"ఈ సినిమా గతంలో మీ నాన్నగారు చేసిన 'బొబ్బిలి పులి' కి రీమేక్ అంటున్నారు, ఎంత వరకు నిజం?"
"అందులో ఎంత మాత్రం వాస్తవం లేదు. అసలా సినిమాకీ, దీనికీ ఏమాత్రం సంబంధం లేదు. దానికీ, దీనికీ దాసరి నారాయణ రావు గారు దర్శకత్వం వహించడం వల్ల, రెండింటికీ మిలటరీ బ్యాక్ డ్రాప్ వుండడం వల్ల చాలా మంది అలా అనుకుంటున్నారు. కానీ, రెండింటికీ ఎక్కడా పోలికలు వుండవు"
"ఇటీవల వచ్చిన 'సింహా'లోనూ, ఇందులోనూ కూడా మీరు డబుల్ రోల్ చేసారు కదా, ఎందుకని ఇలా జరిగింది?"
"ఇది కావాలని ఏదో ప్రణాళికతో చేసింది కాదు. మనం ఎంచుకునే కధను బట్టే ఏదైనా వుంటుంది. ఈ కధకున్న స్పాన్ అటువంటిది. ఆర్మీ ఆఫీసర్ పాత్ర చాలా పవర్ ఫుల్ గా వుంటుంది. పూర్తి ఎమోషనల్ గా సాగుతుంది. ఇక రెండోది సినిమా హీరో పాత్ర. అంటే, నా నిజజీవిత పాత్రన్నమాట. మా నాన్నగారు అంటుండేవారు, 'కళ కళ కోసం కాదు...కళ అనేది సమాజం కోసం' అంటూ. ఈ పాత్ర నాన్నగారి మాటలకు ప్రతిరూపంగా నిలుస్తుంది"
"ఇందులో రావణ బ్రహ్మ వంటి పురాణ పాత్ర, కొమరం భీమ్ వంటి వీరుని పాత్ర పోషించారు కదా, మీ అనుభూతి?"
"ఓహ్...చెప్పలేని అనుభూతి. మాటల్లో వర్ణించలేనిది. నాన్నగారు అప్పట్లో 'సీతారామ కల్యాణం' సినిమాలో రావణాసురిడిగా నటించారు. అది నాకెంతో ఇష్టమైన పాత్ర. అందులో నాన్నగారు ప్రదర్శించిన శైలికి, నా స్టయిల్ ని జోడించి చేసానిందులో. ఇక కొమరం భీమ్ పాత్ర! ఆదిలాబాదు జిల్లాలో గిరిజనులైన గోండుల హక్కుల కోసం మడమ తిప్పకుండా పోరాడిన యోధుడు. అటువంటి వీరుని పాత్ర పోషించగలగడం నా అదృష్టం"
"భవిష్యత్తులో రావణుడి పాత్రతో పూర్తి నిడివి పౌరాణికం చేసే ఉద్దేశం ఉందా?"
"పరమ వీర చక్ర చేస్తున్నప్పుడే ఆ ఆలోచన వచ్చింది. 'సీతారామ కల్యాణం' చిత్రాన్ని నాన్నగారు వారి తల్లిదండ్రులకు అంకితం చేసారు. ఇప్పుడు ఇలాంటిది నేను కూడా చేసి వారికి అంకితం చేయాలని వుంది. చూద్దాం. భవిషత్తు ఎలా వుంటుందో!"
"దాసరి నారాయణ రావుగారితో చేయడం ఎలాంటి ఫీలింగ్ నిచ్చింది?"
"వారితో చేయడం అద్భుతమైన అనుభవం. అసలు వారు తీసిన 'శివరంజని' సినిమాలో నేనే చేయాలి. అయితే, అప్పట్లో ఇంకా చదువు కంప్లీట్ కాకపోవడంతో నాన్నగారు అనుమతివ్వలేదు. ఇన్నాళ్లకు వారితో చేసే అవకాశం కలిగింది. అది అదృష్టమనే చెప్పాలి. అంత పెద్ద దర్శకులై వుండి కూడా నేను ఏవో చిన్న చిన్న సూచనలు చేస్తే, సహృదయంతో స్వీకరించారు. హ్యాట్స్ ఆఫ్ టు హిమ్! వారితో ఆ సినిమా అనుభవం మరచిపోలేనిది"
"మీ చిత్రాలకు సంక్రాంతి సెంటిమెంట్ వుంది కదా, ఈ చిత్రం సక్సెస్ విషయంలో మీకెలాంటి అంచనాలు వున్నాయి"
"అవును, గతంలో సంక్రాంతికి విడుదలైన మా చిత్రాలు 'పెద్దన్నయ్య', 'సమర సింహా రెడ్డి', 'నరసింహ నాయుడు', 'లక్ష్మీ నరసింహా', 'సింహా' వంటివి పెద్ద విజయాన్ని సాధించాయి. ఈ సినిమా కూడా వాటి సరసన చేరుతుంది"
"వంద సినిమాల మైలురాయికి చేరువవుతున్నట్టున్నారు?"
"అవును, ఇప్పుడిది 94 వ చిత్రం. త్వరగానే 100 కి చేరుకుంటాను. నూరవ సినిమా కచ్చితంగా ప్రత్యేకంగా వుంటుంది"

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...