e-cigarette review Ping Yahoo GOSSIPS: యువహీరోలతో చేయడానికి సిద్ధమే -డా. రాజశేఖర్

Wednesday, February 1, 2012

యువహీరోలతో చేయడానికి సిద్ధమే -డా. రాజశేఖర్

ఒకప్పుడు తెలుగులో ఎమోషనల్ ఫిలిమ్స్ అంటే డాక్టర్ రాజశేఖర్ తప్ప మరెవరూ గుర్తొచ్చేవారు కాదు. ఆహుతి, తలంబ్రాలు, అంకుశం, ఆగ్రహం, మగాడు... వంటి సినిమాలు ఆ కోవలోకే వస్తాయి. అయితే, గత కొన్నాళ్లుగా ఆర్టిస్టుగా ఆయన వెనుకపడిపోయారు. అటు రాజకీయాల్లో ఇమడలేక, ఇటు సినిమాలలో సక్సెస్ కాలేక సతమతమవుతున్నారు. ముఖ్యంగా సినిమాలలో ఆ లోటును పోగొట్టుకోవడానికి ఈ ఏడాది వీలైనన్ని ఎక్కువ చిత్రాలు చేసేందుకు ఆయన సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయనతో జరిపిన ముచ్చట్లు... 
         మీరు పరిశ్రమకు వచ్చి ఎన్నేళ్ళయింది?
1984 లో తమిళ పరిశ్రమకి పరిచయమయ్యాను. ఆ మరుసటి సంవత్సరం 'వందేమాతరం' చిత్రం ద్వారా తెలుగు పరిశ్రమకి ఎంటరయ్యాను. ఆ విధంగా చూస్తే, తెలుగు సినిమా రంగానికి వచ్చి 27 ఏళ్ళు అయింది.
         ఇన్నేళ్ళ కెరీర్ లో వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమనిపిస్తోంది?
చాలా సాఫీగా సాగిపోతోంది. ఏ రోజూ కూడా నేను ఖాళీగా మాత్రం లేను. ఇప్పటికి కూడా! చాలా మంది నిర్మాతలు ముందుకొస్తున్నా సరైన కథలు దొరక్క చేయడం లేదు. ఇక మార్పులంటే అప్పటికి ఇప్పటికీ చాలా మార్పులు వచ్చినప్పటికీ కథ, కథనాలు అలానే ఉన్నాయి. సాంకేతికంగా చాలా డెవలప్ అయ్యాము. ఆహ్వానించ దగ్గ విషయమది!
          ఇప్పటివరకు ఎన్ని సినిమాలు పూర్తి చేశారు?
   ఒక్క తెలుగులోనే దాదాపు 80 సినిమాలకు పైగా చేసాను.
       
   ముందుగా తమిళ్ లో పరిచయమైన మీరు, ఆ తర్వాత తెలుగుకే ఎందుకు పరిమితమయ్యారు?
  చాలా మంచి ప్రశ్న. నేను మొదట తమిళ్ చిత్ర సీమలో పరిచయమైనా, నా మాతృభాష మీద ఉన్న మమకారం, హైదరాబాద్ పట్ల విపరీతమైన ప్రేమ పెంచుకోవడం వల్ల ఇక్కడే సెటిల్ అయ్యాను. మధ్యలో తమిళ్ నుంచి చాలా ఆఫర్లు వచ్చినా, ఒకానొక టైంలో చాలా సినిమాలు చేతిలో ఉన్న మూలాన డేట్స్ కుదరక ఒప్పుకోలేదు. కానీ, నేను నటించిన తెలుగు సినిమాలు 30 కి పైగా తమిళనాట విజయం సాధించాయి. ఇకపై తమిళ సినిమాల గురించి కూడా ఆలోచిస్తాను.
         ప్రస్తుతం మీరు చేస్తున్న సినిమాలు?
ఈ సంవత్సరం నాలుగు సినిమాలు విడుదల అయ్యేలా ప్లాన్ చేస్తున్నాను. వీటిలో ముందుగా జీవిత దర్శకత్వం వహిస్తున్న 'మహంకాళి' చిత్రం ఫిబ్రవరి 17 న విడుదల కానుంది. ఆపై నేను ద్విపాత్రాభినయం చేస్తున్న 'అర్జున' రిలీజ్ అవుతుంది. తర్వాత అమ్మ రాజశేఖర్ దర్శకత్వం లో 'మోనార్క్' అనే సినిమా చేస్తున్నాను. ఇది ఫిబ్రవరి 4 న నా పుట్టినరోజు నాడు ప్రారంభమవుతుంది. లగడపాటి శ్రీనివాసరావు , శీనయ్య దీనికి నిర్మాతలు.
        అర్జున, మహంకాళి చిత్రాల గురించి చెప్పండి?
 పాతతరం వాళ్ళు 'ఆహుతి', 'అంకుశం', 'తలంబ్రాలు' వంటి సినిమాలు చేయమంటున్నారు. ఈ తరం వాళ్ళు 'అన్నయ్య', 'సింహరాశి', 'ఎవడైతే నా కేంటి' వంటి సినిమాలు చేయమని అడుగుతున్నారు. వీరిద్దరినీ సంతృప్తి పరిచే చిత్రమే ఈ 'మహంకాళి'. ఇందులో నిజాయతీపరుడైన పోలీసు ఆఫీసర్ పాత్ర చేసాను. ప్రస్తుతం  సినిమా మొత్తం పూర్తి అయ్యింది. దియేటర్ల సమస్య వల్ల విడుదల ఆగిపోయింది. వచ్చే నెల 17 న విడుదలవుతుంది. ఇందులో 5  పాటలున్నాయి. అన్నీ సందర్భానుసారంగా వస్తాయి. ఇక అర్జున విషయాని కొస్తే, నాకు చాలా ఇష్టమైన ప్రాజెక్ట్ అది. ఇందులో తండ్రీ కొడుకులుగా నటిస్తునాను. ఇదొక పవర్ ఫుల్ స్టొరీ. నేటి రాజకీయాలను చర్చిస్తూ మంచి సందేశాన్ని చూపిస్తున్నాము. ఇందులో కొత్త రాజశేఖర్ ని చూస్తారు. సినిమా పూర్తి కాకముందే బిజినెస్ కూడా అయిపోయింది. అప్పట్లో 'అల్లరి ప్రియుడు' చిత్రానికి కూడా ఇదే విధంగా జరిగింది.
        మల్టీ స్టారర్ చిత్రాలపై మీ అభిప్రాయం?
మంచి కథలు, దర్శకులు దొరికితే నేను రెడీగా ఉన్నాను. 'పెదరాయుడు'లో రజనీకాంత్ పోషించిన పాత్రల వంటివన్నమాట. గతంలో చిరంజీవి గారి ' స్నేహం కోసం' సినిమాలో విజయ్ కుమార్ చేసిన పాత్ర నేను చేస్తానని అడిగాను. కానీ, నేను చిరంజీవి కన్నా చిన్న వాడినని వద్దన్నారు. తర్వాత నాగార్జునతో ఒకటి చేయాల్సింది. అదీ కుదరలేదు. మొన్న బాలకృష్ణ, నేను కలిసి చేద్దామని మాట్లాడుకున్నాము. త్వరలో చేయొచ్చు! యువ హీరోలతో సైతం చేయడాని కి సిద్ధమే, కానీ పవర్ ఫుల్ పాత్ర అయివుండాలి.
      మీ డ్రీం ప్రాజక్టులు ఏమైనా ఉన్నాయా?
   'మగాడు' సినిమా లాంటి నెగెటివ్ పాత్ర చేయాలని ఉంది.
      దర్శకత్వం చేసే ఆలోచన ఉందా?
కచ్చితంగా చేస్తాను కానీ, ఇప్పుడు కాదు. ప్రస్తుతం జీవిత చేస్తోంది కదా... 'ఎవడైతే నాకేంటి', 'మహంకాళి' సినిమాలు నా ఆలోచనల నుండి పుట్టినవే!
    రాజకీయాల గురించి చెప్పండి?
ప్రస్తుతం ఈ సినిమాలు అయిపోయిన వెంటనే వాటి గురించి చెపుతాను. ప్రస్తుతం మెడిసిన్ లో ఎం.ఎస్. చేస్తున్నాను. త్వరలో ఏ పార్టీ లో చేరేదీ, లేక సొంత పార్టీ పెట్టేధీ వివరిస్తా....

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...