e-cigarette review Ping Yahoo GOSSIPS: అలుపెరుగని హాస్య తరంగం... బ్రహ్మానందం!

Wednesday, February 1, 2012

అలుపెరుగని హాస్య తరంగం... బ్రహ్మానందం!

తెలుగు సినిమా వెలుగు చూసిన దగ్గరనుంచి ఎందరో హాస్య నటులు తమదైన శైలిలో వెండితెరపై నవ్వుల పువ్వులు పూయించారు. ఆ కోవలో... ఆ దోవలో... నవ్వుల్లో నాణ్యతకి నాంది పలికిన హాస్యతరంగమే బ్రహ్మానందం.1956 ఫిబ్రవరి 1 న గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో ఆయన జన్మించారు. అక్షరంపై ఉన్న మమకారమే ఆయన్ని తెలుగు లెక్చరర్ని చేసింది. నీరు పల్లం వైపు మాత్రమే ప్రవహిస్తుంది. ప్రతిభ పలు దిశలా పరుగులు తీస్తుంది. అలా ఆయన దృష్టి అభినయం దిశగా మళ్లింది...అలుపెరగని హాస్యాన్ని పంచింది.
       'అహ నా పెళ్ళంట' సినిమాలో అరగుండు కేరక్టర్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న బ్రహ్మానందాన్ని 'వివాహ భోజనంబు'...'చూపులు కలిసిన శుభవేళ' ... 'హై హై నాయకా'...వంటి చిత్రాలతో జంధ్యాల ప్రోత్సహించారు. అంతే ఇక బ్రహ్మానందం వెనుదిరిగి చూసుకోలేదు. ఆయన ధరించిన ప్రతి పాత్ర పకపకలు పూయించింది...వినోదాన్ని విస్తారంగా వడ్డించింది. 'రౌడీ అల్లుడు'...'సుందర కాండ' ...'చిత్రం భళారే విచిత్రం' ...వంటి చిత్రాల్లోని పాత్రలు  బ్రహ్మానందం కెరియర్లో మేలైన మైలు రాళ్లని చెప్పొచ్చు. ఇక ఎస్.వి.కృష్ణ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన 'రాజేంద్రుడు-  గజేంద్రుడు'... 'మాయలోడు'... 'యమలీల'... 'వినోదం'...వంటి సినిమాలు బ్రహ్మానందం హాస్యరసపోషణ కి అద్దం పట్టాయనడంలో సందేహం లేదు.
     'చిత్రం భళారే విచిత్రం' లో ''నీ ఎంకమ్మా'' అంటూ ఊత పదాలకి ఊతంగా నిలుస్తూ,  ఖాన్ దాదా గా ''ఖాన్ తో  గేంసొద్దు''...కత్తి రామదాస్ గా ''ఏసేయ్''...అనగనగా ఓ రోజు లో ''మరీ అంత ఎదవలా కనిపిస్తున్నానా'' అంటూ... ఆయన చేసిన నవ్వుల సందడి అంతా ఇంతా కాదు. బ్రహ్మానందం ధరించిన విలక్షణమైన గెటప్స్ వినోదానికి విడిది కేంద్రాల్లా కనిపిస్తాయి. కథ ఏదైనా...కథా నాయకుడు ఎవరైనా కామెడీకి కేంద్ర బిందువు బ్రహ్మానందమే. 'హిట్లర్'...'చూడాలని ఉంది'... 'బావగారూ బాగున్నారా'...'ఇంద్ర'... వంటి చిత్రాల్లో మెగాస్టార్ తో కలిసి ఆయన పండించిన  మెగా నవ్వుల్ని ఎవరూ అంత తేలికగా మరిచిపోలేరు. పల్లె పాత్రల్లోనే కాదు...పాష్ కేరక్టర్స్ లోనూ పసందైన కామెడీని పండించ గలగడం బ్రహ్మానందం స్పెషాలిటీ. గొప్పలకి పోయి భంగపడే పాత్రలనూ...అతితేలివిని-అమాయకత్వాన్ని మిక్స్ చేసిన పాత్రలని ఆయన పోషించిన తీరు చూస్తే ఆ నటనా నైపుణ్యం ఆయనకి మాత్రమే సాధ్యమనిపిస్తుంది.
      అటు అగ్రకథానాయకులకీ ... ఇటు యువతరం కథానాయకులకి కూడా ఫ్రెండ్ గా ఒదిగిపోవడం, ఏజ్ గ్యాప్ తెలియనంతగా ఏకదాటిగా నవ్వించడం బ్రహ్మానందం ప్రత్యేకత... అదే ఆయన విశిష్టత. ఏమీ తెలియదన్నట్టుగా ఎర్రి మొహం వేయడం...''అవ్వా'' అన్నట్టుగా నోరు కొట్టుకోవడం...తింగరి తింగరిగా పరిగెత్తడం వంటివి చేస్తూ తనదైన మార్కుతో మహదానందాన్ని పంచుతోన్న అలుపెరుగని హాస్యతరంగం ఆయన. తరాలు మారుతున్నా...తరగని ఉత్సాహంతో కలిసి కట్టుగా ఆయన కామెడీని నడిపిస్తూనే ఉన్నారు...గెలిపిస్తూనే ఉన్నారు. అందుకే ఈ నవ్వుల రేడుని నాగార్జున యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ వరించింది...అల్లు రామలింగయ్య స్మారక పురస్కారం పలకరించింది. అలుపెరగకుండా ఆయన సాగించిన హాస్య మథనమే ఆయన పేరును గిన్నిస్ బుక్ లోకి  చేర్చింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది హాస్యానికి జరిగిన అభిషేకం... బ్రహ్మానందానికి జరిగిన పట్టాభిషేకం. ఈ రోజు ఆయన పుట్టిన రోజు...ఈ శుభ సందర్భంగా ఆ అభినయ తరంగానికీ...హాస్య పతంగానికి  జన్మదిన శుభాకాంక్షలు తెలియజేద్దాం.     ---పెద్దింటి గోపీకృష్ణ

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...